
ప్రియుడితో కలిసి జీవించేందుకు కన్న కొడుకు ముందే కట్టుకున్న భర్తను ఓ ఇల్లాలు అతికిరాతకంగా నరికి చంపింన ఘటన బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలో వెలుగు చూసింది. బాధితుడి కుమారుడు, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి పీస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పూర్ణియా జిల్లాకు చెందిన ఓ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ పోషన నిమిత్తం భర్త పంజాబ్ వెళ్లి అక్కడే కూలీ పనులు చేస్తూ.. వచ్చిన డబ్బులను ఇంటికి పంపేవాడు. భార్య స్వగ్రామంలోనే ఉంటూ ముగ్గురు పిల్లలను చూసుకునేది. ఈ క్రమంలో భర్త దూరంగా ఉన్న భార్యకు గ్రామంలోని ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
పెళ్లై ముగ్గురు పిల్లలున్న మహిళ పూర్తిగా ప్రియుడి ప్రేమలో మునిగిపోయింది. అతనితో కలిసి జీవించాలనుకుంది. అందుకోసం తన భర్తకు తెలియకుండా తమ ఇంటి స్థలాన్ని అమ్మేసింది. స్థలం అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోవాలని ప్రయత్నించింది. ఇంతలోనే విషయం తెలుసుకున్న భర్త హుటాహుటీన తన గ్రామానికి తిరిగి వచ్చాడు. స్థలం అమ్మిన విషయంపై భార్యను నిలదీశాడు. దీంతో భర్తకు నిజం తెలిస్తే.. ప్రియుడితో కలిసి ఉండడం కుదరదని భావించిన మహిళ ఏ భార్య తీసుకోని నిర్ణయం తీసుకుంది. భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది.
గొడవ కాస్త సర్ధుమణిగి భర్త రాత్రి పడుకున్న తర్వాత ఆమె తన ప్లాన్‌ను అమలు చేసింది. కత్తితో మంచంపై పడుకున్న భర్తను నరకడం స్టార్ట్ చేసింది. భర్తను నరుకుతున్న క్రమంలో రక్తం చింది పక్కనే పడుకున్న ఆమె పన్నెండేళ్ల కుమారిడిపై పడింది. దీంతో నిద్రలేచిన కుమారుడికి తల్లి తన తండ్రిని కత్తితో నరకడం కనిపించింది. అది చూసి ఆమె.. నోరు తెరిస్తే నిన్ను కూలా ఇలానే నరికేస్తానని కొడుకును బెదిరించింది. దీంతో వణికిపోయిన కుమారుడు ఉదయం వరకు అలాగే కళ్లు మూసుకొని నిద్రపోయాడు. ఉదయం లేచిన తర్వాత ఆ బాలుడు ఈ విషయాన్ని తమ సమీప బంధువులకు తెలియజేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలైన మహిళను అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. ప్రియుడితో కలిసి బతికేందుకే భర్తను తాను హత్య చేశానని నిందితురాలు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.