బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనతో మరోసారి ఆ దేశంలో శాంతిభద్రతల గురించి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. జూలై 9న జంక్ డీలర్ లాల్ చంద్ అలియాస్ సోహాగ్‌ను రాజధాని ఢాకాలోని మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి సమీపంలో బహిరంగంగా కొట్టి చంపారు. ఆ తర్వాత హంతకులు అతని మృతదేహంపై నృత్యం చేశారు. ఇది దేశవ్యాప్తంగా అనాగరికతకు నిదర్శనం అంటూ ఈ హత్యకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ హత్యను అనాగరికమైనదిగా,నాగరిక సమాజానికి ఆమోదయోగ్యం కాదని ప్రభుత్వం అభివర్ణించింది. ఆదివారం దేశవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ దారుణ హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు.
హంతకులకు రాజకీయ రక్షణ లభించదు: ప్రభుత్వం
ఈ హత్యలో పాల్గొన్న ఏ నేరస్థుడిని కూడా రాజకీయ నేతలతో ఉన్న సంబంధం ఆధారంగా వదిలిపెట్టబోమని లెఫ్టినెంట్ జనరల్ చౌదరి స్పష్టం చేశారు. నేరస్థులు నేరస్థులే అని ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉందని ఆయన అన్నారు. ఈ హత్య చేసిన నిందుతుడు ఎవరైనా సరే అతనికి ఎటువంటి రాజకీయ నేతల అండ ఉన్నా.. చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. ఈ సంఘటనపై నిఘా సంస్థలు, పోలీసు డిటెక్టివ్ విభాగం దర్యాప్తులో నిమగ్నమై ఉన్నాయి. ఈ సంస్థలు సోహాగ్ ను హత్య చేసిన నిందితుల కోసం నిరంతరం దాడులు నిర్వహిస్తున్నాయి.
శనివారం రాత్రి మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న టిట్టన్ గజార్‌ను ఐదు రోజుల పాటు పోలీసు రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి
హత్య తర్వాత, మృతదేహంపై నృత్యం చేసిన హంతకులు
ఈ దారుణ హత్య వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిలో వ్యాపార వివాదం కారణంగా మిట్‌ఫోర్డ్ హాస్పిటల్ సమీపంలోని రోజోని ఘోష్ లేన్‌లో కొంతమంది వ్యక్తులు జంక్ డీలర్ లాల్ చంద్ అలియాస్ సోహాగ్‌ను కాంక్రీట్ ముక్కలతో కొట్టి చంపారు. వీడియోలో అతని మరణం తర్వాత దాడి చేసిన వ్యక్తులు అతని శరీరంపై నృత్యం చేయడం కూడా కనిపించింది.
ఈ సంఘటన గురించి లాల్ చంద్ సోదరి మాట్లాడుతూ బంగ్షాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రజనీ బోస్ లేన్‌లోని మసీదు పక్కన ఉన్న ఒక దుకాణంలో అతను చాలా కాలంగా స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని చెప్పారు. వ్యాపార ప్రయోజనాలు, షాప్ ఉన్న భూమిపై గురించి లాల్ చంద్ తో పాటు అతనిపై దాడి చేసిన వారి మధ్య వివాదం ఉంది. నిందితుడు గతంలో లాల్ చంద్ గిడ్డంగిని సీలు చేసి, ఆ ప్రాంతం వదిలి వెళ్ళమని పదే పదే బెదిరించాడని ఆమె చెప్పారు.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యాపించింది. శనివారం వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తాత్కాలిక ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం సామూక హింసను ఆపడంలో విఫలమైందని అన్నారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ న్యాయమైన దర్యాప్తును డిమాండ్ చేశారు.
బాధితుడి కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని.. సమాజంలో చట్టం పట్ల భయాన్ని నెలకొల్పడానికి ఈ హత్య కేసును ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదిలీ చేయడానికి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించామని హోం సలహాదారు చౌదరి తెలియజేశారు. మిట్‌ఫోర్డ్‌లో జరిగిన హత్య చాలా విచారకరమని… అనాగరికమైనది అని ఆయన అన్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి సంఘటనలకు చోటు లేదు. ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. త్వరలో న్యాయం జరిగేలా చూస్తుందని చెప్పారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా నిరంతరం దాడులు
ఆగస్టు 2024 నుంచి బంగ్లాదేశ్‌లో సాముహిక హింసాకాండ సంఘటనలు పెరుగుతున్నాయి. అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని 16 ఏళ్ల అవామీ లీగ్ ప్రభుత్వాన్ని విద్యార్థి ఉద్యమం ‘స్టూడెంట్స్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్’ (SAD) తొలగించినప్పుడు దేశంలో రాజకీయ అస్థిరత , చట్టపరమైన శూన్యత వాతావరణం నెలకొంది. తాజా హింసాకాండ సంఘటనకు ముందు, ఈ నెల ప్రారంభంలో కోమిల్లాలోని మురాద్‌నగర్ ప్రాంతంలో ఒక మహిళను ఆమె ఇద్దరు పిల్లలను కొట్టి చంపారు. వారు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే పోలీసు దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభ్యంకలేదని చెబుతున్నారు.
మానవ హక్కుల సంస్థలు , సామాజిక కార్యకర్తలు ప్రభుత్వం.. మూకుమ్మడి హింస, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధోరణిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి, పోలీసు బలగాలను సున్నితం చేయడానికి ప్రత్యేక శిక్షణ, పర్యవేక్షణ అవసరమని అనేక సంస్థలు సూచించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..