అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ఇచ్చిన నివేదికపై రగడ రాజుకుంది. టేకాఫ్, కటాఫ్, క్రాష్ అంటూ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీసీఏకు సమర్పించింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో కనిపించింది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ప్రాథమిక నివేదికపై పైలట్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తప్పంతా పైలట్లదే అనే చూపించే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. నివేదికలో పారదర్శకత లోపించిందని , ఎందుకు రహస్యంగా రిపోర్ట్‌ను విడుదల చేశారని ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ALFA ప్రశ్నించింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ, ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించారు. ఇప్పటికే ఇంజిన్లను భద్రపరిచారు. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది.
తక్కువ కాలంలో AAIB అద్భుతమైన నివేదిక ఇచ్చిందన్నారు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు. తొలిసారి భారత్ లోనే బ్లాక్‌బాక్స్‌ను సురక్షితంగా డీకోడ్ చేసినందుకు AAIBకి అభినందనలుర తెలిపారు. అయితే ఇప్పుడు ప్రాథమిక నివేదిక మాత్రమే అందిందని , తుది నివేదిక కోసం వేచిచూస్తుట్టు చెప్పారు.
మొత్తానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ఇచ్చిన ప్రాథమిక నివేదికపై స్పష్టత రావడం లేదు. పైలట్ల తప్పిదంతో ప్రమాదం జరగిందా ? లేక ఇంజిన్లు పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందా ? అన్న విషయంపై క్లారిటీ లేదు. సమగ్ర నివేదిక వచ్చిన తరువాతే ఈవిషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.