Kota Srinivasa Rao పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు… విలన్‌గా ముచ్చెమటలు పట్టిస్తాడు

Kota Srinivasa Rao పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు… విలన్‌గా ముచ్చెమటలు పట్టిస్తాడు


ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్నారు. 750కి పైగా సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. కమెడియన్‌గా, విలన్‌గా ఏ పాత్రకైనా జీవం పోశారు. కోట శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1968లో రుక్మిణితో వివాహము అయింది. కోటకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. 2010 జూన్ 21న రోడ్డుప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ మరణించడంతో అతని పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు కోటా. 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు.

కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శక నిర్మాత క్రాంతి కుమార్ కోటాకు తొలి అవకాశాన్ని ఇచ్చారు. 1986 వరకు సినిమాలను సీరియస్‌గా తీసుకుని నటించారు. ప్రతి ఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు లభించింది. అహ నా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడుగా కొనసాగారు. కోటా, బాబుమోహన్ జంట అంటే సినిమా హిట్టే అనే టాక్ ఉండేది. కోటా బాబు మోహన్ కలసి దాదాపు 60 చిత్రాల్లో నటించారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు.

మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించారు కోటా. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేశారు. అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడు కోటా కన్నుమూయడం సినీ రంగానికి తీరని లోటు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *