
నిజామాబాద్ జిల్లా తాళ్ళపల్లి గ్రామానికి చెందిన పిపావత్ నగేశ్(21) కరీంనగర్‌లో డిగ్రీ చదువుతూ.. రాంనగర్‌లోని SC హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో స్పా మసాజ్ నేర్చుకున్న నగేశ్, కరీంనగర్ వచ్చి ‘గ్రైండర్’ అనే డేటింగ్ యాప్‌ను ఉపయోగించి సెన్సువల్ మసాజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఫోన్ చేసి కోరితే, వారి వద్దకు వెళ్లి మసాజ్ చేసి డబ్బులు తీసుకునేవాడు. ఈ నెల 4న గ్రైండర్ యాప్ ద్వారా ఒక వ్యక్తి నగేశ్‌ను సెన్సువల్ మసాజ్ కోసం పిలిచాడు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్లేదారిలో ఉన్న ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ వద్దకు రమ్మని చెప్పడంతో.. నగేశ్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడ ఒక వ్యక్తి పరిచయం చేసుకోగా.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళారు. మసాజ్‌ల గురించి మాట్లాడుతుండగా.. అప్పటికే రెండు వైపుల నుంచి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు నగేశ్‌ను దూషిస్తూ, చేతులతో కొట్టారు. అతని వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. భయపడిన నగేశ్ తన ఫోన్‌పే ద్వారా వారి నంబర్‌కు రూ. 15,000 పంపించాడు. అలాగే జేబులో ఉన్న రూ. 2,000.. చేతికి ఉన్న వాచ్‌ను కూడా ఇచ్చేశాడు. డబ్బులు తీసుకున్న అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
భయంతో రెండు రోజులు హాస్టల్‌లోనే ఉన్న నగేశ్, శనివారం(జూలై 6) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నగేశ్ పంపించిన ఫోన్‌పే నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పడి నిందితుల కోసం గాలించాయి. జూ 7 మధ్యాహ్నం, సాంకేతికతను ఉపయోగించి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్‌కు చెందిన ఎస్.కె. షాబుద్దీన్ ఇంటి వద్దకు వెళ్ళిన పోలీసులు.. ఈ నేరంలో పాల్గొన్న ముగ్గురు నిందితులు ముస్తాఫా ఇమ్రాన్, మహ్మద్ అమీర్, సాదాబ్‌లను పట్టుకున్నారు. విచారణలో వారు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. బషీర్ అనే మరో నిందితుడు పారిపోయాడని తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 14,000 నగదు, 3 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న బషీర్‌ను కూడా త్వరలోనే పట్టుకుంటామని రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపారు.
ఇకపై ఎవరైనా సెన్సువల్ యాప్‌లు ఉపయోగించి ఇతరులను మోసపూరితంగా పిలిపిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ఇటువంటి యాప్‌లకు దూరంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అటువంటి అసాంఘిక కార్యకలాపాలు తమ దృష్టికి వస్తే, లేదా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని.. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.