
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చేసిన ప్రకటనతో చమురు ధరలు మరింత పెరిగేలా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 నుంచి 130 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 103 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది. అందులో ఇరాన్ వాటా 32 లక్షల బ్యారెళ్లుగా ఉంది.
చమురు ఉత్పత్తిలో ప్రపంచంలో 9వస్థానంలో ఉంది ఇరాన్. మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది ఆ దేశం. ఇజ్రాయెల్ దాడులతో పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచదేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేయాలనే ప్రతిపాదనని ఇరాన్ పరిశీలిస్తోంది. ఒకవేళ అదే జరిగినా.. లేదంటే అమెరికాతో సన్నిహితంగా ఉంటున్న సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులకు దిగినా మొత్తం ప్రపంచదేశాలపై దాని ప్రభావం ఉండబోతోంది.
ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టాక మొదట అణు, సైనికస్థావరాలను టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. తర్వాత ఇరాన్ చమురు, సహజవాయు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి చేసింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు నిక్షేపాలున్న సౌత్పార్స్లో ఇరాన్ పాక్షికంగా ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేస్తే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.