మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సిటీలోని ఐష్ బాగ్ అనే ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ ప్రాతంలో జనం ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇదే ప్రాంతంలో ఓ రైల్వే లైన్ కూడా ఉంది. అయితే రైల్వే గేటు పడినప్పుడల్లా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆ ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు పదేళ్ల క్రితం ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకనా సాగుతూ ఉంది. పదేళ్లైనా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయకపోవడంతో అధికారులపై స్థానిక జనం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక దీనిపై స్పందించిన మంత్రి విశ్వాస్ సారంగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి డెడ్ లైన్ విధించారు. అనుకున్న డేట్‌లోపు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
ఇక మంత్రి హెచ్చరికలతో అధికారులు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అనుకున్న డేట్‌లోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేశారు. అయితే ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసిన తరుణంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ నిర్మాణం 90 డిగ్రీల మలుపుతో జరిగింది. సాధారణంగా ఫ్లై ఓవర్ మలుపును 30 డిగ్రీల వరకు పెడతారు..కానీ ఇక్కడ వీరు నిర్మించిన బ్రిడ్జ్ L ఆకారంలో 90 డిగ్రీల మలుపుతో ఉంది. అయితే ఈ మలుపు కారణంగా వాహనాలు ఆగి వెళ్లాల్సి ఉంటుంది, అంతే కాకుండా ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
#WATCH | Madhya Pradesh | A newly-built bridge constructed in Bhopal’s Aishbagh features a 90-degree turn pic.twitter.com/M1xrJxR45e
— ANI (@ANI) June 12, 2025
అయితే, బ్రిడ్జ్ మలుపు 90 డిగ్రీల ఉంటే.. బ్రిడ్జ్‌పై ప్రయాణించే వాహనాలు మలుపు దగ్గరకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆగి వాహనాన్ని టర్న్ చేయాల్సి వస్తుంది.దీంతో బ్రిడ్జ్‌పై కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఉపయోగం ఏంటని ఈ బ్రిడ్జ్ నిర్మాణం చూసిన వాహనదారులు అంటున్నారు. అంతేకాకుండా ఇలా 90 డిగ్రీల మలుపు ఉండడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో స్పీడ్ గా వచ్చే వాహనాలు దాన్ని గమనించకుండా ఢీకొట్టి కిందపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..