అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన… కనీవినీ ఎరుగని విషాదమిది. రెండు వందలకు పైగా ప్రాణాలను బలితీసుకున్న అత్యంత ఘోర ప్రమాదం. ప్రస్తుతానికి రిస్క్యూ ఆపరేషన్స్ మీదే ఫోకస్ చేసింది అధికార యంత్రాంగం. శిథిలాల తొలగించాలి.. బ్లాక్‌బాక్స్ దొరికాలి.. పోస్ట్‌మార్టమ్ తంతు ముగియాలి. ఇలా ప్రాథమిక దర్యాప్తు తర్వాతే ప్రమాద కారణాలేంటో తెలిసేది. కానీ.. ఘటన వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా అనే సందేహం కూడా లేకపోలేదు..!
విమానం కూలిన విధానం, మృతుల సంఖ్య భారీగా ఉండడం.. బాధితుల్లో ముఖ్యమంత్రి స్థాయి నేత ఉండడం, రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం.. ఇవన్నీ కలిసి అనుమానాలకు దారితీస్తోంది. ప్రమాద సమయంలో బోర్డింగ్‌లో ఉన్న వీవీఐపీల్లో విజయ్ రూపానీ ఒకరు. 2016 నుంచి 2021 వరకు ఐదేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు. అంతకుముందు కొన్నాళ్ల పాటు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అతడితో ఎవరెవరికి రాజకీయ శతృత్వం ఉంది.. వ్యాపారపరమైన వైరం ఏమైనా ఉందా..? అనే చర్చ జరుగుతోంది జనంలో..!
ఇదిలా ఉంటే…. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్‌తో ఇటీవలే దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకుంది భారత్. పహెల్గామ్ నరమేధం తర్వాత ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కి తీవ్ర డ్యామేజ్ కలిగించి నెలరోజులే గడిచింది. అటు.. సింధూ జలాల ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టి.. కశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కడుతూ పాకిస్తాన్‌కు నీటి కష్టాలకు పరోక్షంగా కారణమయ్యాం. మన మీద కక్షగట్టి ఛాన్స్ కోసం గుంటనక్కలా కాచుకుని చూస్తోంది దాయాది దేశం. అంతర్గత రక్షణ విషయంలో ఇది అత్యంత సున్నితమైన సమయం.
పాకిస్తాన్లో టెర్రర్ మూలాల్ని చిదిమేశామని మన మిలిటరీ వాళ్లు స్టేట్మెంట్ ఇచ్చింది. దాయాది దేశం దెబ్బతిన్న పులి. రక్తం మరిగిన తోడేలు. మన ఉప్పు తింటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం పేరిట ఊడిగం చేసే స్పై మూకలను ఒక్కరొక్కరిగా ఏరిపారేస్తోంది మన ఇంటిలిజెన్స్ వ్యవస్థ. అయినా.. దేశంలో నలుమూలలా ఐఎస్ఐ ట్రెయిన్డ్ తీవ్రవాదులు పొంచి ఉన్నట్టు.. ఏ క్షణాన్నయినా ఎటువంటి దుశ్చర్యకైనా పాల్పడ్డవచ్చన్న కోణంలో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఎందుకంటే.. ముష్కర మూకలకు అమెరికాలో డబ్ల్యుటీసీ టవర్లనే కూల్చివేసిన చరిత్రుంది.
అందుకే.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఘటన ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా.. కుట్ర కోణం దాగుందా అనే కోణంలో దర్యాప్తు జరిపేందుకు సిద్ధమవుతోంది సర్కార్. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన 5 నిమిషాలకే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. మే డే అన్న సమాచారం తర్వాత ATC తో విమాన సంబంధాలు కోల్పోయింది. పహెల్గామ్ ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాద కోణం దాగి ఉందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే దర్యాప్తు కోసం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డైరెక్టర్ జనరల్ అహ్మదాబాద్‌కు బయలుదేరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..