ఆగని రాజన్న కోడెల మరణాలు.. 5 రోజుల్లో 26 మృతి.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..

ఆగని రాజన్న కోడెల మరణాలు.. 5 రోజుల్లో 26 మృతి.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..


సాక్షాత్తూ నందీశ్వరుడినే ఆ శివుడికి అర్పిస్తున్నామన్న నమ్మకం, భావనతో.. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడెమొక్కులు తీర్చుకుంటుంటారు. అందుకే, ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విధంగా వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు నెలవుగా పేరు గాంచింది. అంతేకాదు, వేములవాడ ఆలయానికి వచ్చే ఆదాయంలో 70 శాతం పైగా ఆ కోడెమొక్కుల టిక్కెట్ల ద్వారానే సమకూరుతోంది. అయితే, ఆ కోడెలనే ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదన్నది ప్రధాన విమర్శ. ఇదే ఆదీ కాదు.. అంతం అంతకన్నా కాదు. కోడెలు మృత్యువాత పడటం.. వాటిని గుట్టుచప్పుడు కాకుండా తిప్పాపురం మూలవాగులో పాతిపెట్టడం.. ఇలాంటి నిరసనలు చేపట్టడం వేములవాడలో ఎందరు అధికారులు, ప్రభుత్వాలు మారినా ఓ నిత్యకృత్యంగా మారిపోయింది.

ఏకంగా 5 రోజుల్లో 26 కోడెలు మృత్యువాత పడటం.. వాటిని తిప్పాపురంలో పాతిపెట్టడంతో బీజేపీ నేతలతో పాటు, హైందవ సంఘాలన్నీ నిరసనలకు దిగాయి. మరోవైపు, ఇదే గోశాలలో మరో 16 కోడెలు కూడా అనారోగ్యంగా ఉన్నట్లు పశువైద్యులు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు. కోడెల పరిరక్షణపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా కోడెలు చనిపోతుండటంతో వివాదం మరింత ముదిరింది. మీడియాలో వార్తా కథనాలు కూడా వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఏకంగా దేవాలయ కమిషనర్ కూడా సందర్శించి.. ప్రెస్ తో కూడా మాట్లాడారు. మరోవైపు, రాజన్న కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

రాజన్న కోడెల మృత్యువాతపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సీరియస్ అయ్యారు. ఏకంగా రాజన్న కోడెల గోశాలకు పశు, వైద్యాధికారులను జిల్లా యంత్రాంగం పంపించి నివేదిక కోరింది. మరోవైపు, దేవాదాయశాఖ అధికారులు కూడా ఓ అధికారిని పంపించి పూర్తిస్థాయి నివేదికకు కోరారు. అయితే, గోశాలలో లెక్కకు మించి కోడెలుండటం, కోడెలకు తగ్గ సంఖ్యలో సంరక్షకులు లేరని, సరైన పౌష్ఠికాహారం అందడం లేదని నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, రాజన్న కోడెల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఆలయ అధికారులదే పూర్తి బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రాజన్న కోడెలను పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులకు ఉచిత పంపిణీ చేపట్టారు.

రాజన్న కోడెల వ్యవహారం ప్రతీసారీ రాజకీయ రంగు పులుముకుంటుండటంతో కూడా.. అధికారులు నాన్ సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా రాజన్న కోడెల వ్యవహారంలో తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడమే తప్ప.. శాశ్వత ప్రాతిపదికన వాటి సంరక్షణ గురించి ఆలోచించిన అధికారులుగానీ, ప్రభుత్వాలుగానీ లేవు. ఇప్పటికైనా రాజన్న ఆలయానికి అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కోడెల సంరక్షణ పట్ల సీరియస్ గా ఆలోచించాలని భక్తులు కోరుతున్నారు.

కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం..

వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమంటూ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బిఆర్ఎస్ కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మేం కాపాడుకుంటాం.. అంటూ పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. రోజూ కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదంటూ ఫఐర్ అయ్యారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *