Weather Update: రుతుపవనాల మందగమనం.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం..!

Weather Update: రుతుపవనాల మందగమనం.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం..!


తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని భయపడే రోహిణి కార్తెలో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈ యేడు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాల రాకతో అటు ఏపీ, ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశారు. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం అయిపోయినట్టే అనుకున్నారు ప్రజలంతా. కానీ, అప్పుడే పూర్తవలేదన్నట్టుగా గత నాలుగైదు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రెండ్రోజులుగా తెలంగాణతో పాటుగా కోస్తాంధ్రతీరంలో ఉన్న జిల్లాల్లో ఎండలు ఇరగకాస్తున్నాయి. ఉక్కపోత కూడా పెరగడంతో.. ప్రజలు అల్లాడుతున్నారు. నైరుతి మందగమనంతోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి వేడి పొడిగాలులు మొదలవ్వడంతో పాటు ఎండల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇకపోతే, తెలంగాణలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు మరో 5 రోజులపాటు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తుండటంతో రాబోయే ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. ఈ రోజు(జూన్‌4 గురువారం) తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రాగాల రెండు రోజులలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని చెప్పింది. ఈ రోజు గరిష్టంగా నల్లగొండ లలో 38.5, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 32.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదిలా ఉంటే, అటు ఏపీలో రుతుపవనాల మందగమనం కనిపిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేసవి పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అరేబియా సముద్రం, బంగాళాకాతంలో రుతుపవన కరెంట్ (కదలిక) బలహీనంగా ఉండడంతో అనేక ప్రాంతాల్లో తిరిగి వేసవి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా చెప్పింది. ఏపీలోని కోస్తాలో కొన్నిచోట్ల సెగలు కక్కే వాతావరణం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకూ నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని సాయంత్రం పూట అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలు లతో వర్షాలు కూడా పడుతున్నాయి. నిన్న జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తాలో అనేకచోట్ల వేడి వాతావరణం ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలు, ఒకటిరెండుచోట్ల 40 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *