
వయసు ఒక నెంబర్ మాత్రమే అనే మాట నిజమే. కొందరికి 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనం, ఉత్సాహం కనిపిస్తాయి. మరికొందరికి 30 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వయసులో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ అకాల వృద్ధాప్యానికి కారణాలు ఏంటి..? మీ శరీరం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోందని సూచించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలసట
ఉదయం లేవగానే ఒక రోజు అలసటగా అనిపించడం సహజమే. కానీ 7 నుంచి 9 గంటలు నిద్రపోయినా కూడా పగలు బద్ధకంగా, అలసటగా ఉంటే అది మంచి సంకేతం కాదు. వయసుతో పాటు శరీరం మెలటోనిన్, గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ల తగ్గుదల 30 ఏళ్ల వయసులోనే మొదలైతే.. అకాల వృద్ధాప్యం అవుతున్నట్లు సంకేతం. దీనికి పరిష్కారం.. పడుకునే ముందు ఫోన్ వాడకం తగ్గించండి. పాలు, బాదం లాంటి మెగ్నీషియం ఉన్న ఆహారం తీసుకోండి.
పొడి చర్మం, ముడతలు
చర్మంపై ముడతలు రావడం వృద్ధాప్యానికి మొదటి సూచన. మీ వయసు వాళ్ల కంటే ముందుగానే మీ చర్మం పొడిగా మారి, సన్నని గీతలు కనిపిస్తే అది వేగంగా వయసు పెరుగుతోందని అర్థం. అధిక ఒత్తిడి, యూవీ కిరణాలు, చెడు ఆహారపు అలవాట్ల వల్ల కొలాజెన్, ఎలాస్టిన్ దెబ్బతింటాయి. దీనికి పరిష్కారం.. రోజు తప్పకుండా సన్ స్క్రీన్ వాడండి. నీరు ఎక్కువగా తాగండి. విటమిన్ సి ఉన్న ఆహారాలు, కొలాజెన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
కండరాలు తగ్గిపోవడం
మీరు ఇంతకు ముందు తిన్నట్లే తింటున్నా కొవ్వు పెరుగుతున్నట్లు అనిపిస్తుందా..? ఇది సార్కోపెనియా అనే కండరాలు కోల్పోవడమే కావచ్చు. ఇది మెటబాలిజం నెమ్మదించిందని సూచిస్తుంది. వయసు పెరిగే కొద్దీ కండరాలు కోల్పోయి కొవ్వు పెరుగుతుంది. ఇది 30 ఏళ్ల లోనే జరిగితే అకాల వృద్ధాప్యం మొదలైనట్లే. దీనికి పరిష్కారం.. వారంలో కనీసం రెండు సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయండి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర తగ్గించండి.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం
తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం లేదా ఏకాగ్రత లోపించడం ఎక్కువైతే అది కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే కాదు. ఇది అకాల మెదడు వృద్ధాప్యం కావచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి, చెడు నిద్ర, పోషకాహార లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు, గింజలు తినండి. ధ్యానం, పజిల్స్ ఆడటం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోండి.
మోకాళ్లు, కీళ్ల నొప్పులు
వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు రావడం మామూలే. కానీ 30 ఏళ్లకే మోకాళ్లు, కీళ్ల నొప్పులు, వాపులు వస్తే అది కీళ్లు త్వరగా వృద్ధాప్యం అవుతున్నాయని అర్థం. శరీరంలో వాపు పెరగడం దీనికి ప్రధాన కారణం. దీనికి పరిష్కారం.. పసుపు, బెర్రీలు, ఆకుకూరలు వంటి వాపు తగ్గించే ఆహారాలు తినండి. సైక్లింగ్, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయండి. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.
భావోద్వేగ అలసట
ఆందోళన, చిరాకు, డిప్రెషన్ వంటివి కూడా శరీరం, మెదడు వృద్ధాప్యానికి చేరుతున్నాయనడానికి సంకేతాలు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి అది జీవసంబంధ వృద్ధాప్యాన్ని పెంచుతుంది. దీనికి పరిష్కారం.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, వాకింగ్ వంటివి చేయండి. మీకు నచ్చిన పనులు చేయడంపై దృష్టి పెట్టండి.
తరచుగా అనారోగ్యాలు
తరచుగా జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వస్తూ.. అవి తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి బలహీనపడిందని అర్థం. ఇది అకాల వృద్ధాప్యం వల్ల కావచ్చు. దీనికి పరిష్కారం.. రోజూ పండ్లు, కూరగాయలు తినండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
అకాల వృద్ధాప్యాన్ని ఆపడం ఎలా..?
- వ్యాయామం.. రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి.
- ఆహారం.. ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి.
- నిద్ర.. 6 నుంచి 7 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి.
- నీరు.. రోజూ తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.
ఈ చిన్నపాటి మార్పులు మీ యవ్వనాన్ని కాపాడతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం.