న్యూఢిల్లీ, మే 21: కర్ణాటక హోం మినిస్టర్ డాక్టర్ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థలపై బుధవారం (మే 21) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆకస్మిక సోదాలు నిర్వహించింది. తుమకూరులోని హెగ్గెరె సమీపంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ, ఎస్‌ఎస్‌ఐటీ కాలేజీలో ఈడీ దాడులు నిర్వహించింది. అలాగే బెంగళూరు శివార్లలోని నెలమంగళలోని టి. బేగూర్‌లో ఉన్న మరో కళాశాలపై కూడా ఏక కాలంలో దాడి చేసింది.
ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎస్‌ఎస్‌ఐటీ కళాశాలపై ఈడీ దాడి చేసింది. పది మందికి పైగా అధికారులు మూడు కార్లలో వచ్చి SSIT కళాశాలలో పత్రాలను తనిఖీ చేశారు. కళాశాల ఆవరణలోకి మీడియా ప్రతినిధులు ప్రవేశించవద్దని డివైఎస్పీ హెచ్చరించారు. అలాగే డివైఎస్పీ నాయకత్వంలో కళాశాలకు భద్రత కల్పించారు. 2019లో సిద్ధార్థ విద్యా సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో మెడికల్ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఐటీ దాడులు చేసింది. సరిగ్గి అదే సమయంలోనే పరమేశ్వర్ సన్నిహితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆ తరువాత దాడి ప్రక్రియ ఆగిపోయింది. 2019 దాడి తర్వాత ఐటీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం అందించారు.
2019 ఐటీ దాడుల సందర్భంగా పరమేశ్వర్ సన్నిహితుడు రమేష్‌ను ప్రశ్నించారు. ఈ పరిణామం తరువాత అతను బెంగళూరులోని జ్ఞాన్ భారతి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. రమేష్ ఆత్మహత్యకు ఐటీ అధికారుల వేధింపులే కారణమని అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తీవ్రమైన ఆరోపణ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు జరిపిన దాడుల్లో పత్రాలను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.