తిరుమలలో ఈ ఏడాది జులై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే రోజున 3.24 లక్షలు విక్రయించగా అది 35 శాతం వరకు పెరగడం విశేషం. దీంతో ఆ ఒక్కరోజులోనే లడ్డూల విక్రయం ద్వారా రూ.2.43 కోట్లు సమకూరింది.
గత ఏడాది జులై నెలలో లడ్డూల తయారీ (చిన్నవి 160-180 గ్రాములు) 1,04,57,550 ఉండగా, ఈ ఏడాది జులైలో 1,25,10,300కు పెరిగింది. గత జులైలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జులైలో 1,24,40,082 అమ్ముడుపోయాయి. దీంతోపాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు కూడా సరిపడా అవసరాల కోసం బఫర్ స్టాక్ కింద 4 లక్షలు పెట్టుకున్నారు.
ఇకపోతే, లడ్డూ నాణ్యత విషయంలోనూ టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా.. పరీక్షల కోసం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇక.. తిరుమలలో వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ కసరత్తు మొదలు పెట్టింది.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) సంస్థ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.. లడ్డు నాణ్యత పెంచడం, ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి పెరిగేందుకు అవసరమయిన సిబ్బందిని నియామకాలు జరపడం, భక్తులందరికి లడ్డులు లభ్యమయ్యేందుకు అటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడంతో డిమాండ్ పెరిగిందని టిటిడి అధికారులు చెప్పారు.
ప్రస్తుతం సెలవుల రోజుల్లో గతం కంటే భారీగా వస్తున్న భక్తుల కోసం అమలు చేస్తున్న క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇక.. ప్రస్తుతం నవంబర్ మాసానికి సంబంధించిన దర్శనం.. వసతి.. సేవా టోకెన్ల పంపిణీ జరుగుతోంది.