Headlines

వేడి రాజుకుంటున్న మరో ఉద్యమం.. తెలంగాణను కుదిపేస్తున్న ‘గో బ్యాక్ మార్వాడీ’..!

వేడి రాజుకుంటున్న మరో ఉద్యమం.. తెలంగాణను కుదిపేస్తున్న ‘గో బ్యాక్ మార్వాడీ’..!


కొన్ని రోజుల క్రితం తెలంగాణలో రాజుకున్న గో బ్యాక్ మార్వాడీ నినాదం ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. ఈ వివాదం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. రాజకీయం వేరు. వ్యాపారం వేరు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో దీనికి భిన్నం. వ్యాపారం చేసుకునే వాళ్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. తెలంగాణలో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు ఏపీకి కూడా అంటుకుంది. గో బ్యాక్ మార్వాడీ అంశం తెరపైకి వచ్చింది. మెల్లమెల్లగా ఉద్యమ రూపం దాల్చుతోంది.

చిన్న ఘర్షణ కారణంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌తో మొదలైంది ‘గోబ్యాక్ మార్వాడీ’ నినాదం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరుగా వ్యాపిస్తోంది. ‘‘మీరొచ్చి మా కడుపు కొడుతున్నారు.. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు’’ అని మార్వాడీల ఉనికిని ప్రశ్నిస్తోంది తెలంగాణలో లోకల్ వర్తక సమాజం. కానీ, తమపై వ్యతిరేకత కృత్రిమమే అంటున్న మార్వాడీలు, తిప్పికొట్టే ప్రయత్నాన్నీ ముమ్మరం చేశారు. సెంటిమెంట్‌తోనే కౌంటర్లు ఇస్తున్నారు. గుజరాత్ మా జన్మభూమి, తెలంగాణ మా కర్మభూమి.. ఇక్కడే పుట్టాం..ఇక్కడే పెరిగాం.. తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. మేమూ మీ వాళ్లమే అంటున్నారు. పైగా, డిప్యూటీ సీఎంతో తమకున్న దగ్గరి బంధుత్వాన్ని గుర్తు చేస్తూ, మేమూ లోకలే అని గట్టిగా వాదిస్తోంది తెలంగాణలో మార్వాడీ సొసైటీ.

డూప్లికేట్ వస్తువులు అమ్మితే కస్టమర్లు ఎలా వస్తారు.. ఇన్నాళ్లూ మమ్మల్ని ఎలా నమ్మారు? అని నిలదీస్తున్నారు మార్వాడీలు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వేలామంది కార్మికులు పనికోసం ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. వాళ్లతో లేని పేచీ తమతో మాత్రమే ఎందుకు అనేది మార్వాడీల వాదన. హక్కుల గురించి మాట్టాడ్డం మాకూ తెలుసు అంటున్నారు గుజరాతీ తెలుగోళ్లు. అటు.. మార్వాడీల అంశాన్ని జాతీయవాదానికి ముడిపెడుతూ భారతీయ జనతా పార్టీ కూడా కోరస్ ఇస్తోంది. దేశంలో ఎక్కడివాళ్లు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చన్న వాదనకు బలం చేకూరుస్తోంది.

సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఓ దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తూ.. ఆగస్టు 22న తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి పిలుపునిచ్చారు. ఓయూ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బంద్ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. కొందరు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ‘‘గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ గుజరాతి రాజస్థాన్’’ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని ఓయూ హాస్టల్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలావుంటే, సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో తనపై జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని దాడిలో గాయపడిన బాధితుడు సాయి వివరణ ఇచ్చారు. కేవలం తనకు, SK జువెల్లర్స్ కు మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపాడు.

మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఉపిరి పోసుకుంటోంది. ఆల్ మర్చంట్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమైంది. ‘మార్వాడి కో హఠావో తెలంగాణ బచావో’ అనే నినాదంతో కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఏకంగా శుక్రవారం (ఆగస్టు 22)న తెలంగాణ బంద్‌‌కు పిలుపునిచ్చారు. మార్వాడీల మేజిక్‌తో తమ వ్యాపారాలు దెబ్బయిపోతున్నాయని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. తెలుగురాష్ట్రాల్లో కొద్దికొద్దిగా రాజుకుంటూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది గోబ్యాక్ మార్వాడీ నినాదం.

అటు ఏపీలో కూడా రచ్చరచ్చవుతోంది గోబ్యాక్ మార్వాడీ స్లోగన్. మార్వాడీలను తరిమికొట్టాలని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. స్థానిక మార్వాడీలు జైనులు ఎమ్మెల్యేను ఆశ్రయించి, అండగా నిలవాలని కోరారు. మార్వాడీలపై ఈగ వాలనివ్వబోమని మాటిచ్చారు ఎమ్మెల్యే. ఇటు హైదరాబాద్‌లో మార్వాడీ హఠావో.. తెలంగాణ బచావో అంటూ గళమెత్తారు వైశ్య వికాస వేదిక నాయకులు. ఎల్బీనగర్‌లో 3 కిలోమీటర్ల మేర భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజస్థాన్‌, గుజరాత్‌ మార్వాడీలు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తెలుగురాష్ట్రాల్లో మెల్లగా రాజుకున్న గోబ్యాక్ మార్వాడీ నినాదం ఎటు వైపు దారి తీస్తుందో అన్న ఆందోళన నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *