విమానయాన చరిత్రలో ఘోర విషాదం. ఎయిరిండియా 171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకు ఊహించని ప్రమాదం. ఆకాశంలో రివ్వున ఎగరాల్సిన ఫ్లైట్.. రన్‌వే నుంచి పైకి ఎగరగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది. అదీ జనావాసాలపై. ఫ్లైట్ లో ఉన్న ఒక్కరు తప్పా అందరు ప్రాణాలు కోల్పోయారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 241మంది చనిపోయారు. ఎందుకిలా జరిగింది. ఎలా జరిగింది. ఏం జరిగింది. కుట్రకోణం ఉందా.. టేకాఫ్ అయ్యే ముందు ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించాకే ఏటీసీ నుంచి అనుమతి లభిస్తుంది. అలాంటిది గాల్లోకి ఎగిరిన నిమిషాల్లోనే ఎలా కుప్పకూలింది..?
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్…గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. అయినా ఇప్పటివరకు ప్రయాణికులను క్షేమంగానే గమ్యస్థానాలకు చేర్చింది. జూన్ 5నుంచి జూన్ 12వరకు అనేకమార్లు లండన్, పారిస్, మెల్బోర్న్, టోక్యోలాంటి ప్రపంచ నగరాలకు ప్రయాణికులను క్షేమంగా చేరవేసింది. జూన్ 5 నుంచి ఇప్పటివరకు 13సార్లు ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్‌కు ఫ్లై అయింది. అయితే పలుమార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. అసలు బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక సాంకేతిక సమస్యలతో కలవరపెడుతోంది.
కొన్ని నివేదికల ప్రకారం, N819AN రిజిస్ట్రేషన్ కోడ్ కలిగిన డ్రీమ్‌లైనర్ 25 రోజుల వ్యవధిలో అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది. హైడ్రాలిక్ లీక్‌లు, సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు డైవర్ట్ అయింది, ఫలితంగా అనేక విమానాలు రద్దయ్యాయి. జనవరి 7న ఈ విమానం హైడ్రాలిక్ లీక్ కారణంగా మొదటి డైవర్షన్ ఎదుర్కొంది. ఇటీవల, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన డ్రీమ్‌లైనర్ ఆమ్‌స్టర్‌డామ్‌లో సాంకేతక సమస్యలతో ఆగిపోయింది.
బోయంగ్ 787-8 విమానం 2012 సెప్టెంబర్‌లో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది. అంటే దాదాపు 13 ఏళ్లుగా అది సర్వీసులు అందిస్తోంది. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, అహ్మదాబాద్ ప్రమాదం.. విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకుని, 174 నాట్ల వేగంతో ఉండగా, హఠాత్తుగా 475 అడుగుల వేగంతో కిందకు దిగి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇలా ఎత్తు కోల్పోవడం హైడ్రాలిక్ లీక్ సమస్యలతోనే సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా 787-8 మోడల్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. బోయింగ్ 787, 777 మోడల్స్‌లో తయారీ లోపాలు ఉన్నాయని, వీటిని పరిష్కరించకపోతే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం ఒక కారణంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు దీంతో డ్రీమ్‌లైనర్ భద్రతపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..