
భారతదేశం-చైనా మధ్య చాలా కాలంగా నిలిచిపోయిన సరిహద్దు వాణిజ్యం మళ్ళీ ప్రారంభం కానుంది. దీనివల్ల రెండు దేశాలకు ప్రతి సంవత్సరం 5 నుంచి 6 బిలియన్ డాలర్ల ప్రయోజనం చేకూరుతుందని ADB, ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తున్నాయి. షిప్కి లా, సనతులా, బోమ్డిలా పాస్‌లు తెరుచుకోనున్నాయి. భారతదేశం చైనాకు ఎరువులను సరఫరా చేస్తుంది. చైనా భారతదేశానికి అరుదైన లోహాలను సరఫరా చేస్తుంది. ఇది భారతదేశ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇదిలావుంటే, లిపులేఖ్ పాస్ ద్వారా భారతదేశం-చైనా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనే నేపాల్ వ్యతిరేకతను ప్రభుత్వం బుధవారం(ఆగస్టు 20) తోసిపుచ్చింది. అటువంటి వాదనలు అన్యాయమైనవి, సమర్థనీయమైనవి కావు, చారిత్రక వాస్తవాలు లేనివి అని పేర్కొంది. ఖాట్మండు గతంలో లిపులేఖ్ కనుమ దక్షిణ భాగం, కాలాపానీ ప్రాంతం అని పిలువబడేది. నేపాల్‌కు చెందినదిగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో వాణిజ్యం సహా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని నేపాల్ ప్రభుత్వం భారత్‌ని కోరుతోందని పేర్కొంది. ఈ వ్యాఖ్యలను భారతదేశం ఖండించింది. ప్రాదేశిక వాదనలకు సంబంధించి, అటువంటి వాదనలు సమర్థనీయం కాదని, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా లేవు అనేది భారత ప్రభుత్వం పేర్కొంది.
“ఈ విషయంలో మా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. లిపులేఖ్ పాస్ ద్వారా భారతదేశం-చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం 1954లో ప్రారంభమైంది. దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇటీవలి సంవత్సరాలలో కోవిడ్, ఇతర పరిణామాల కారణంగా అంతరాయం ఏర్పడింది. అయితే, చర్చలు, దౌత్యం ద్వారా అంగీకరించిన సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడంపై నేపాల్‌తో నిర్మాణాత్మక పరస్పర చర్యకు భారతదేశం సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
నేపాల్ అధికారిక పటాన్ని నేపాల్ రాజ్యాంగంలో చేర్చామని, మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణి నేపాల్‌లో అంతర్భాగాలని నేపాల్ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందని నేపాల్ ప్రభుత్వం బుధవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. “ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం నేపాల్ భూభాగం అని స్నేహపూర్వక దేశమైన చైనాకు కూడా సమాచారం అందిందని తెలిసింది” అని నేపాల్ పేర్కొంది. నేపాల్-భారతదేశం మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాల స్ఫూర్తికి అనుగుణంగా, చారిత్రక ఒప్పందాలు, వాస్తవాలు, పటాలు, ఇతర ఆధారాల ఆధారంగా దౌత్యపరమైన మార్గాల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి నేపాల్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.
లిపులేఖ్ పాస్ వివాదం భారతదేశం-నేపాల్ మధ్య చాలా కాలంగా ఉన్న ప్రాదేశిక సమస్య, ఇది ప్రధానంగా కాలాపానీ ప్రాంతంలో వారి సరిహద్దు ఖచ్చితమైన స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఈ విభేదాలు 1816 సుగౌలి ఒప్పందం నుండి వచ్చాయి. ఇది రెండు దేశాల మధ్య సరిహద్దుగా కాళీ నదిని ఎంచుకున్నారు. లిపులేఖ్ కనుమకు వాయువ్యంగా ఉన్న లింపియాధుర నుండి ఈ నది ఉద్భవించిందని నేపాల్ వాదిస్తోంది, అందువల్ల ఆ బిందువుకు తూర్పున ఉన్న కాలాపానీ, లిపులేఖ్ తో సహా మొత్తం ప్రాంతం నేపాల్ భూభాగం అని నేపాల్ వాదిస్తోంది. భారతదేశం ఈ వాదనను తిరస్కరిస్తుంది. నది మూలం కాలాపానీ గ్రామం సమీపంలోని నీటి బుగ్గల వద్ద ఉందని, వివాదాస్పద భూభాగాన్ని ఉత్తరాఖండ్ పరిధిలో వస్తుందని వాదిస్తోంది.
2020లో, కైలాష్ మానసరోవర్ యాత్రకు యాత్రికులు ఉపయోగించే లిపులేఖ్ కనుమకు దారితీసే 80 కిలోమీటర్ల కొత్త రహదారిని భారతదేశం ప్రారంభించింది. నేపాల్ వెంటనే ఈ చర్యను నిరసిస్తూ, ఈ రహదారి తన సార్వభౌమ భూభాగాన్ని ఆక్రమించిందని, చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి మునుపటి ఒప్పందాలను ఉల్లంఘించిందని వాదించింది. నేపాల్ ప్రభుత్వం వివాదాస్పద ప్రాంతాలను తన సొంత భూభాగంలో భాగంగా చిత్రీకరించే కొత్త రాజకీయ పటాన్ని కూడా విడుదల చేసింది. ఈ మార్పును ప్రతిబింబించేలా దాని రాజ్యాంగాన్ని సవరించింది.
ఇదిలావుంటే, గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి రెండు దేశాలు కృషి చేస్తున్నందున, ఆగస్టు 19న చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటన సందర్భంగా భారతదేశం-చైనా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడానికి అంగీకరించాయి.
భారతదేశం-చైనా సరిహద్దు వాణిజ్యం వేల సంవత్సరాల నాటిది. ఇది సిల్క్ రూట్, హిమాలయ పాస్‌ల ద్వారా శతాబ్దాలుగా కొనసాగింది. 1962 యుద్ధం తర్వాత నాథు లా పాస్ (సిక్కిం) మూసివేశారు. ఆ తర్వా 2006లో తిరిగి తెరుకుకుంది. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, వినియోగ వస్తువుల వ్యాపారం ఇక్కడి నుండి జరుగుతుంది. లిపులేఖ్ పాస్ ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇది భారతదేశం-చైనా సరిహద్దు వాణిజ్యానికి కూడా దోహదపడింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న షిప్కి లా పాస్ చారిత్రాత్మకంగా ఉన్ని, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, స్థానిక ఉత్పత్తుల మార్పిడి పెద్ద ఎత్తున జరిగాయి.
తాజా ఒప్పందం ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్‌లోని షిప్కి లా పాస్, సనతుల పాస్, బోమ్డిలా రోడ్డు ప్రాధాన్యతా క్రమంలో తెరవనున్నారు. భారత ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఇంధన రంగాలకు అత్యంత అవసరమైన అరుదైన లోహాల సరఫరాకు చైనా హామీ ఇచ్చిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిగా, భారతదేశం చైనాకు ఫాస్ఫేట్, పొటాష్ ఆధారిత ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ ఒప్పందం భారతదేశ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని, చైనా ఆహార భద్రతా వ్యూహానికి దోహదపడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య ప్రధాన ఆర్థికవేత్త అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..