
దేశ రాజధాని ఢిల్లీలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని మైదాన్‌గఢీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను ప్రేమ్ సింగ్, ఆయన భార్య రజనీ, వారి 24 ఏళ్ల కుమారుడు హృతిక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వారి రెండో కొడుకు సిద్ధార్థ్ కనిపించకుండా పోయాడు. సత్బారి ఖార్క్‌లో ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా.. ప్రేమ్ సింగ్, హృతిక్ మృతదేహాలు రక్తపు మడుగులో నేలపై పడి ఉన్నాయి. రజనీ మృతదేహం మొదటి అంతస్తులో నోరు కట్టేసి ఉంది.
కత్తి, ఇటుకలతో దాడి చేసి ఈ హత్యలు చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత సిద్ధార్థ్ అదృశ్యమయ్యాడు. దీంతో అతడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తప్పించుకున్న సిద్ధార్థ్ గత 12 సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో పోలీసులకు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం.. సిద్ధార్థ్ అగ్రెసివ్ బిహేవియర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తులో సిద్ధార్థ్ తన కుటుంబాన్ని చంపేశానని, ఇకపై ఇక్కడ ఉండనని ఎవరో ఒకరికి చెప్పినట్లు కూడా తెలిసింది.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. తప్పించుకున్న సిద్ధార్థ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత వెల్లడి కానున్నాయి. కాగా ఈ గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది ఢిల్లీలో హత్యలు పెరిగాయి. మొదటి ఆరు నెలల్లోనే దేశ రాజధానిలో 250 హత్యలు జరిగాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..