ఆ యువతిది త్రిపుర రాష్ట్రం. ఢిల్లీలో చదువుకుంటుంది. ఉన్నట్టుండి ఆమె కనిపించకుండా పోయింది. ఇప్పటికీ 5రోజులు అవుతున్నా.. ఆమె జాడ లభించలేదు. పోలీసులకు సైతం ఎటువంటి క్లూ దొరకలేదు. ఈ ఘటనపై త్రిపుర సీఎం కార్యాలయం కూడా స్పందించింది. కానీ ఈ కేసు మాత్రం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్కు చెందిన 19 ఏళ్ల స్నేహ దేబ్నాథ్ దేశ రాజధానిలో అదృశ్యమైంది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆత్మ రామ సనాతన్ ధర్మ కళాశాలలో చదువుకుంటోంది. జూలై 7న యువతి తన ఫ్యామిలీతో చివరిసారిగా మాట్లాడింది. ఈ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. త్రిపుర సీఎం కార్యాలయం సైతం ఈ ఘటనపై స్పందించింది. తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. స్నేహ.. తన ఫ్రెండ్ పితునియాతో కలిసి రోహిల్లా రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నట్లు ఉదయం 6గంటల సమయంలో ఆమె తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఉదయం 8:45 గంటలకు తల్లి మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎటువంటి స్పందన లేదు.
ఈ ఘటనకు సంబంధించి క్యాబ్ డ్రైవర్ కీలక విషయం వెల్లడించారు. ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జి సమీపంలో యువతిని దింపినట్లు తెలిపాడు. ఈ ప్రాంతంలో భద్రతా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉండవు. ఇప్పుడిదే పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ నెల 9న సిగ్నేచర్ బ్రిడ్జి చుట్టుపక్కల 7కిలోమీటర్ల పరిధిలో అణువణువు జల్లెడ పట్టారు. అయినా వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు స్పేహకు సంబంధించి ఎటువంటి వస్తువులు లేవని.. కొన్ని రోజుల నుంచి డబ్బు కూడా తీసుకోలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి త్రిపుర పోలీసులు ఢిల్లీ పోలీసులను కాంటాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో స్నేహ గురించి ఏమైన తెలిస్తే.. తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..