మూడవ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది.. రష్యా మాజీ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

మూడవ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది.. రష్యా మాజీ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మరోసారి హెచ్చరించారు. పుతిన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న వైమానిక దాడుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. తాను లేకుంటే రష్యాకు చాలా ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు. ఇదిలావుంటే, ఈ వారం చివరి నాటికి రష్యాపై కొత్త ఆంక్షలు విధించే విషయాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం(మే 26) విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఆంక్షలను పెంచడం గురించి సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పుతిన్‌ను ఓ పిచ్చివాడుగా అభివర్ణించారు.

ట్రంప్ ప్రకటనపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ తీవ్రంగా స్పందించారు. తనకు ఒకే ఒక విషయం తెలుసు అని ఆయన అన్నారు. పుతిన్‌ను హెచ్చరిస్తే మరింత ప్రమాదం పొంచి ఉందన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడం ఆపకపోతే, ఉక్రెయిన్‌లోని బఫర్ జోన్ పోలాండ్‌కు చేరుకుంటుందని మెద్వెదేవ్ ఒక వీడియోను విడుదల చేశారు. తనను తాను ప్రపంచ శాంతి దూతగా చెప్పుకుంటున్న ట్రంప్‌నకు గట్టి హెచ్చరికగా మెద్వెదేవ్ ట్వీట్ చేస్తూ, “పుతిన్ అనే నిప్పుతో ఆడుకోవడం నిజంగా మంచిది కాదు. ప్రస్తుతం నాకు నిజంగా ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. అది మూడవ ప్రపంచ యుద్ధం. ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను!” అని ట్వీట్ చేశారు.

వాస్తవానికి, ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్‌ చర్చలు జరిపారు. పుతిన్‌తో రెండు గంటలకు పైగా ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని ట్రంప్ అన్నారు. ట్రంప్ చొరవతో స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఉక్కెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇంతోనే మే 24న ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. రష్యా 9 బాలిస్టిక్ క్షిపణులు, 60 క్రూయిజ్ క్షిపణులు, 298 డ్రోన్లతో కీవ్ పై దాడి చేసింది. ఆ తర్వాత ట్రంప్ పుతిన్‌ను బహిరంగంగా విమర్శించారు. మరోసారి దాడి జరగడంతో పుతిన్‌ను పిచ్చివాడుగా అభివర్ణించాడు డొనాల్డ్ ట్రంప్.

ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను కొనసాగిస్తుండగా, కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు పదేపదే చేసిన పిలుపులను పట్టించుకోకపోవడంతో, పుతిన్‌పై ట్రంప్‌నకు పెరుగుతున్న నిరాశ మధ్య మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పుతిన్ “నిప్పుతో ఆటలాడుతున్నారని” ట్రంప్ మండిపడ్డారు. ఆయన జోక్యం లేకుండా రష్యాలో ఇప్పటికే చాలా చెడ్డ విషయాలు జరిగి ఉండేవి అని ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఆ నిజంగా చెడ్డ విషయాలు ఏమిటో ట్రంప్ పేర్కొనలేదు.

ఆట ముగిసిపోయిందని పుతిన్‌కు గుణపాఠం చెప్పేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాస్లీ డిమాండ్ చేశారు. అదే సమయంలో, రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమొక్రాట్ రిచర్డ్ బ్లూమెంటల్ కూడా రష్యన్ చమురు, గ్యాస్, ముడి పదార్థాలను కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెలికాప్టర్‌ను ఉక్రెయిన్ కూల్చివేసేందుకు ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. రష్యన్ వైమానిక దళం మేజర్ జనరల్ యూరి డాష్కిన్ ప్రకారం, పుతిన్ మే 20న కుర్స్క్‌ను సందర్శించారు. ఈ సమయంలో ఉక్రెయిన్ వైమానిక దళం 46 డ్రోన్లతో పుతిన్ హెలికాప్టర్‌పై దాడి చేసిందని, అయితే అన్ని డ్రోన్‌లను కూల్చివేశామని డాష్కిన్ చెప్పారు.

గత ఏడాది ఆగస్టులో ఉక్రేనియన్ సైన్యం ఆకస్మిక దాడి చేసి 1,100 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న ప్రదేశం కుర్స్క్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక విదేశీ సైన్యం రష్యన్ గడ్డపై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ఇప్పుడు ఈ భూమి మళ్ళీ రష్యా నియంత్రణలోకి వచ్చిందని పుతిన్ అన్నారు. ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ఇక్కడి మందుపాతరలను తొలగించడానికి సైనికులను పంపాలని ఆయన ఆదేశించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *