చర్మంపై మొటిమలు రావడం చాలా మందికి సాధారణ సమస్య. అయితే ఇది కేవలం చర్మ సంబంధిత సమస్య మాత్రమే కాదు.. అంతకంటే లోతైన శరీర ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా సూచించవచ్చు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. ముఖంలోని వేర్వేరు భాగాల్లో మొటిమలు రావడం శరీరంలో జరుగుతున్న లోపాలను సంకేతంగా చూపవచ్చు. అందుకే కేవలం బ్యూటీ క్రీములు వాడటం ద్వారా కాకుండా.. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
నుదిటిపై మొటిమలు
నుదిటి భాగంలో తరచూ మొటిమలు వస్తుంటే అది జీర్ణ సమస్యలకు సంకేతం కావచ్చు. ఫ్రై చేసిన, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, నీరు తక్కువగా తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం ఏర్పడి మొటిమలుగా కనిపించవచ్చు.
ముక్కుపై మొటిమలు
ముక్కుపై వచ్చే మొటిమలు గుండె ఆరోగ్యం, రక్తపోటుతో సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంది. అధిక ఒత్తిడి, అధిక కొవ్వు, కాలుష్య పరిస్థితులు కూడా దీనికి కారణమవుతాయి.
చెంపలపై మొటిమలు
చెంపలపై మొటిమలు వస్తే ఊపిరితిత్తుల బలహీనత లేదా వాతావరణ కాలుష్యం కారణంగా రావొచ్చు. ఎక్కువగా దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో ఉంటే లేదా మురికిగా ఉండే దిండు కవర్లు వాడితే మొటిమలు వస్తాయి.
దౌడలు, గడ్డం కింద మొటిమలు
హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖ్యంగా మహిళలలో పీరియడ్స్ కు ముందు దౌడలు, గడ్డం చుట్టూ మొటిమలు రావడం సహజం. ఇది శరీరంలోని హార్మోన్ వ్యవస్థ లోపంగా సూచించవచ్చు.
రెండు కనుబొమ్మల మధ్య మొటిమలు
ఈ భాగంలో మొటిమలు కనిపిస్తే కాలేయం పనితీరులో అంతరాయం ఏర్పడిందని సూచించవచ్చు. శరీరంలో విష పదార్థాలు పెరగడం వల్ల ఇది సంభవించవచ్చు. డిటాక్స్ ఆహారాలు, తక్కువ మసాలా వంటలు, నీరు ఎక్కువగా తాగడం మంచిది.
కళ్ళ కింద మొటిమలు
శరీరానికి తగినంత నీరు అందకపోవడం లేదా అధిక మానసిక ఒత్తిడి వల్ల కళ్ళ కింద మొటిమలు, వలయాలు, వాపులు కనిపించవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.
నుదిటి చివరి భాగంలో మొటిమలు
నుదిటి చివర నుంచి చెవుల దగ్గర మొటిమలు కనిపిస్తే మూత్రపిండాలు, మూత్రాశయ సమస్యలను సూచించవచ్చు. ఇవి శరీరం నుంచి వచ్చే నొప్పిలేని సంకేతాలు కావచ్చు.
ముఖం ఒక అద్దంలా పని చేస్తుంది. అంటే మన శరీరంలో ఏదైనా లోపం జరిగినప్పుడు ముఖం మొటిమల రూపంలో సంకేతాలను చూపుతుంది. అందుకే ఎక్కడ మొటిమ ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా.. చర్మంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా పరిశీలించాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)