మన శరీరానికి కావాల్సిన పోషకాల్లో ఐరన్ చాలా ముఖ్యం. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి అవసరం. దాని వల్ల ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. ఐరన్ తక్కువగా ఉంటే అనీమియా అనే సమస్య వస్తుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శక్తి లేకపోవడం
సరిపడా నిద్రపోయినా అలసిపోయినట్లు అనిపిస్తే.. లేదా మామూలు పనులు చేయడానికి కూడా శక్తి లేకపోతే అది ఐరన్ లోపం వల్ల కావచ్చు. ఇది మొదట కనిపించే లక్షణాలలో ఒకటి.
తల తిరగడం
తరచూ తలనొప్పులు రావడం లేదా తల తిరుగుతున్నట్లు అనిపించడం కూడా ఐరన్ లోపానికి గుర్తు కావచ్చు. మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇలా అవుతుంది.
చేతులు, కాళ్లు చల్లగా..
శరీరంలో రక్తం సరిగా ప్రవహించకపోతే, చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా అనిపించవచ్చు. ఇది కూడా ఐరన్ లోపాన్ని సూచించే వాటిలో ఒకటి.
చర్మం రంగు మారడం
ఐరన్ లోపం వల్ల శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. ఇది ముఖ చర్మంతో పాటు శరీరంలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. చర్మం రంగు మసకబారడానికి లేదా తెల్లగా కనిపించడానికి దారి తీస్తుంది.
గోళ్లు బలహీనపడటం
ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు గోళ్లు చాలా సున్నితంగా మారతాయి. త్వరగా విరిగిపోతాయి. ఇది శరీరంలో పోషకాలు తక్కువగా ఉన్నాయని తెలిపే గుర్తు.
జుట్టు రాలడం
ఐరన్ లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలడం, కాంతి లేకపోవడం, చర్మం పొడిగా మారడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇది రక్తం తక్కువగా ప్రవహిస్తున్నట్లు సూచిస్తుంది.
పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే దయచేసి సొంతంగా చికిత్స చేసుకోకండి. సరైన పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ఐరన్ లోపాన్ని సరైన సమయంలో గుర్తిస్తే పెద్ద ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)