తల్లిదండ్రులు అవ్వాలనే కోరికతో చాలా జంటలు ఉంటారు. కానీ సరైన టైంలో ప్రయత్నించకపోవడం వల్ల నిరాశే మిగులుతుంది. నెలలో ఏ రోజుల్లో ప్రయత్నిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయో చాలా మందికి తెలియదు. ఈ చిన్న విషయం తెలియకపోవడమే గర్భం దాల్చకపోవడానికి కారణం అవుతుంది. మరి గర్భధారణకు బెస్ట్ టైం ఏంటి.. ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫెర్టైల్ విండో అంటే ఏంటి..?
ఫెర్టైల్ విండో (Fertile Window) అంటే గర్భం దాల్చడానికి బాగా అనువైన కొన్ని రోజులు. ఈ టైం అండం విడుదల (Ovulation) జరిగే టైంకి దగ్గరగా ఉంటుంది. అండం విడుదలైన తర్వాత అది కేవలం 12 నుంచి 24 గంటలు మాత్రమే బ్రతికి ఉంటుంది. కానీ వీర్యకణాలు మాత్రం మహిళ శరీరంలో 5 నుంచి 7 రోజుల వరకూ యాక్టివ్ గా ఉంటాయి. అందుకే అండం విడుదల కావడానికి ముందు 5 రోజులు, అండం విడుదలైన రోజు కలిపి మొత్తం 5 నుంచి 7 రోజులు గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు.
ఎలా గుర్తించాలి..?
చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే.. కేవలం 14వ రోజు రూల్ ను నమ్ముకోవడం. కానీ ఈ రూల్ అందరికీ ఒకేలా వర్తించదు. ప్రతి మహిళలో నెలసరి సైకిల్ వేరుగా ఉంటుంది.
పీరియడ్ సైకిల్ ప్రకారం
- సాధారణ 28 రోజుల సైకిల్ ఉన్నవారికి.. వీరిలో ఓవులేషన్ సాధారణంగా 14వ రోజున జరుగుతుంది. కాబట్టి నెలసరి అయిన 10వ రోజు నుంచి 17వ రోజు వరకు ప్రయత్నించడం బెస్ట్.
- చిన్న సైకిల్ 21 రోజులు ఉన్నవారికి.. వీరిలో అండం విడుదల 7వ రోజుకే జరగవచ్చు.
- పెద్ద సైకిల్ 35 రోజులు ఉన్నవారికి.. వీరిలో అండం విడుదల 21వ రోజున జరగవచ్చు.
- మీ పీరియడ్ సైకిల్ ఎన్ని రోజులు ఉంటుందో లెక్కించుకొని.. ఓవులేషన్ టైంను అంచనా వేసుకోవాలి.
ఓవులేషన్ టెస్ట్ కిట్స్
మీ ఓవులేషన్ టైంను కచ్చితంగా తెలుసుకోవడానికి ఈ కిట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ కిట్స్ మూత్రంలో పెరిగే ల్యూటినైజింగ్ హార్మోన్ (LH) లెవెల్స్‌ను గుర్తించి ఓవులేషన్ జరగబోతోందని చెబుతాయి. అప్పుడు మీరు ప్రయత్నించవచ్చు.
ఓవులేషన్ ట్రాకర్ యాప్స్
ఇప్పుడు చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పీరియడ్ డేట్స్‌ను ప్రతి నెలా అందులో ఎంటర్ చేస్తే ఆ యాప్ మీ ఓవులేషన్ టైంను.. అలాగే ప్రెగ్నెన్సీకి అనుకూలమైన రోజులను కరెక్ట్‌గా లెక్కిస్తుంది.
99 శాతం మంది చేసే పెద్ద తప్పు ఇదే
చాలా మంది కేవలం అండం విడుదలయ్యే రోజున మాత్రమే ప్రయత్నించాలి అనుకుంటారు. కానీ అండం విడుదలయ్యాక అది కేవలం 12 నుంచి 24 గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. ఆ టైం దాటిపోతే ప్రయత్నం వేస్ట్ అవుతుంది. అందుకే అండం విడుదల కావడానికి ముందు 2 నుంచి 3 రోజుల నుంచే ప్రయత్నిస్తే వీర్యకణాలు అండం కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. తద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సులు బాగా పెరుగుతాయి.
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్లకి పీరియడ్ సైకిల్, ఓవులేషన్ టైం గురించి కంప్లీట్ అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈ ఫెర్టైల్ విండో గురించి తెలుసుకుని సరైన టైంలో ప్రయత్నించడం ద్వారా చాలా మందికి తల్లిదండ్రులు అయ్యే కల నెరవేరుతుంది.