ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ బాట.. కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు!

ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ బాట.. కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు!


పదవీ విరమణ జరిగి రెండేళ్లయినా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా రావడం లేదు. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు.. చివరికి హెల్త్‌ స్కీమ్‌ కూడా సక్రమంగా అమలు చేయడం లేదంటున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. తమవి గొంతెమ్మ కోరికలేం కాదంటున్నారు. హామీల అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే జంగ్ సైరన్‌ మోగించారు ప్రభుత్వ ఉద్యోగులు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. హామీల అమలు కోసం కార్యాచరణ ప్రకటించాయి. బీఆర్ఎస్‌ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చామని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఉద్యోగులు వాపోయారు. పదవీ విరమణ చేసిన వారికి సర్దుబాటు బిల్లులు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లు . హెల్త్‌ స్కీమ్‌ కూడా సక్రమంగా అమలు కావడం లేదంటూ ఉద్యోగులు ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు వేస్తామని చెప్పి టైమ్ పాస్ చేస్తోందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో పాత పెన్షన్ సాధన సదస్సు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు చెల్లించాలని, నెలకు 700 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, పీఆర్సీ అమలు, జీఓ 317 బాధితులకు న్యాయం చేయడంతో పాటు SSA ఉద్యోగుల వేతన సమస్య పరిష్కారించాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జంగ్‌ సైరన్‌ మోగించింది.

ఇటు ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించింది. 12వ వేతన సంఘం (పీఆర్‌సీ) కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, మధ్యంతర భృతి (ఐఆర్‌) తక్షణమే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 3 డీఏల్లో 2 వెంటనే ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా 11వ పీఆర్సీ, డీఏ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే-స్లిప్లుల్లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థికేతర, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎస్‌ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. హామీల అమలు కోసం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పడితే.. ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతులతో సరిపెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *