14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం, ఆడిన మూడో మ్యాచ్‌లోనే మెరుపు సెంచరీతో దుమ్మురేపిన వైభవ్ సూర్యవన్షీ తాజాగా ప్రధాని మోదీని కలిశాడు. బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని పాట్నా ఎయిర్ పోర్ట్‌లో తల్లిదండ్రులతో వెళ్లి కలిశాడు వైభవ్. క్రికెట్‌నే కెరీర్‌గా మల్చుకొని.. అతి చిన్న వయసులో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వైభవ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. పైగా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. టీమిండియాకు ఆడి దేశానికి ప్రాతినిథ్యం వహించడమే కలగా ముందుకు సాగుతున్న వైభవ్‌ను ప్రధాని మోదీ అభినందించారు.
యంగ్ క్రికెటింగ్ సెన్సెషన్ అంటూ వైభవ్‌ను ప్రశంసించారు. అలాగే వైభవ్‌తో కలిసి ఫొటోలను కూడా ప్రధాని మోదీ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేయడం విశేషం. “పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవన్షీ, అతని కుటుంబ సభ్యులను కలిశాను. అతని క్రికెట్ నైపుణ్యాలను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు! అతని భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వైభవ్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సూర్యవన్షీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే ఈ టీనేజర్ 252 పరుగులు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..