వనపర్తి, ఆగస్ట్ 21: తెలంగాణలోని వనపర్తిజిల్లాలోని ఘన్‌పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతు (37)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు రవీందర్ (19), చిన్న కుమారుడు సంతోష్ ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం వీరు జీవనోపాధి కోసం గచ్చిబౌలిలోని ఎన్టీఆర్‌నగర్‌కు వలస వచ్చి జీవిస్తున్నారు. హనుమంతు మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక పెద్ద కొడుకు రవీందర్ ఇంటర్ పూర్తి చేసి ఏ పనీ చేయకుండా బెట్టింగ్ ఆడుతూ డబ్బులు వృధాగా పోగొట్టుతున్నాడు. బెట్టింగుల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు సైతం చేస్తున్నాడు. ఈ క్రమంలో చిన్న కుమారుడి చదువుకు డబ్బుల్లేక హనుమంతు సొంతూరులోని భూమి తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తెచ్చాడు.
అయితే ఆ డబ్బుపై కన్నేసిన రవీందర్ బ్యాంకులో వేస్తే భద్రంగా ఉంటుందని మాయమాటలు చెప్పి.. తన అకౌంట్‌లో రూ.2.5 లక్షలు జమ చేయించుకున్నాడు. ఈ డబ్బు మొత్తం బెట్టింగ్ యాప్‌లో పెట్టి పోగొట్టాడు. అకౌంట్‌లో ఉన్న డబ్బులు విత్ డ్రా చేద్దామని తండ్రి అడిగిన ప్రతీసారి ఏదోసాకు చెప్పి తప్పించుకోసాగాడు. మరోవైపు కొడుకు బెట్టింగ్‌ల యవ్వారంపై తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తండ్రిపై కక్ష పెంచుకున్నాడు రవీందర్. మంగళవారం మధ్యాహ్నం మరోమారు డబ్బుల గురించి తండ్రి హనుమంతు కొడుకును నిలదీశాడు.
దీంతో తన ఫ్రెండ్ డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని చెప్పి.. ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తండ్రిని తీసుకెళ్లాడు. సర్‌ప్రైజ్ అని చెప్పి తండ్రి కళ్లకు గంతలు కట్టిన రవీందర్.. అప్పటికే అనతో తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతులో పొడిచాడు. దీంతో హనుమంతు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.