తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. జీర్ణవ్యవస్థ, ఇమ్యూనిటీ, షుగర్ నియంత్రణకు ఈ ఒక్క పండు చాలు..!

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. జీర్ణవ్యవస్థ, ఇమ్యూనిటీ, షుగర్ నియంత్రణకు ఈ ఒక్క పండు చాలు..!


జామపండులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది నారింజ పండు కంటే కూడా మూడింతల ఎక్కువ పోషకాన్ని అందిస్తుంది. భారతీయ పోషకాహార సంస్థలు, అంతర్జాతీయ పోషక శాస్త్రవేత్తలు ఈ పండును అత్యంత ఆరోగ్యకరమైనదిగా గుర్తించాయి. ఈ పండు గుణాలను విశ్లేషిస్తూ.. ప్రతి ఒక్కరూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హెల్తీ గట్

జామపండులోని ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి.. ఇది ప్రేగుల కదలికలను సాఫీగా చేయడంలో సహాయపడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్లు, మినరల్‌ లే కాకుండా.. పుష్కలంగా ఉండే ఫైబర్ మలాన్ని మెత్తబరుస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య ఉన్నవారు దీన్ని తినడం వల్ల శుభ్రమైన జీర్ణవ్యవస్థను, ఆరోగ్యకరమైన గట్‌ ను పొందుతారు.

డయాబెటిస్ వారికి మంచి ఆప్షన్

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారు జామపండును నమ్మకంగా తీసుకోవచ్చు. ఇందులోని ఫైబర్ గ్లూకోజ్‌ ను శోషించడాన్ని నెమ్మదింపజేసి.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఈ కారణంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది.

రోగనిరోధక శక్తి పెంపు

జామపండు విటమిన్ Cకి గొప్ప మూలం. ఇది శరీరాన్ని వైరస్‌ లు, బ్యాక్టీరియాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. అలాగే విటమిన్ A ఉండటంతో కంటిచూపు మెరుగుపడుతుంది. కంటికి ఆరోగ్యం, శక్తివంతమైన చూపును అందించడంలో ఇది తోడ్పడుతుంది.

తక్కువ ఖర్చుతో అధిక లాభాలు

జామపండు ధర పరంగా కూడా అందరికీ అందుబాటులో ఉండే పండు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి వయసులోని వారు దీన్ని సురక్షితంగా తినవచ్చు. దాదాపు సంవత్సరం పొడవునా మార్కెట్‌ లో లభించే ఈ పండు ప్రకృతి అందించిన అత్యంత విలువైన బహుమతిగా చెప్పవచ్చు.

జామపండును రోజూ ఒకటి లేదా రెండు తినడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే మితంగా తీసుకోవడమే మంచిది. మలబద్ధకం నివారణతో పాటు జీర్ణవ్యవస్థ, ఇమ్యూనిటీ, చక్కెర నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *