Tushar Raheja: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. ఆదివారం, జూన్ 15న సేలంలోని ఎస్‌సీఎఫ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన 12వ మ్యాచ్‌లో తిరుప్పూర్ తమిళయన్స్ బ్యాటర్ తుషార్ రహేజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ట్రిచీ గ్రాండ్ చోళాస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన రహేజా..
165 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన తిరుప్పూర్ తమిళయన్స్‌కు ఓపెనర్ తుషార్ రహేజా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే ట్రిచీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రహేజా, మైదానం నలువైపులా బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా పేసర్ పి. శరవణ కుమార్ వేసిన మూడో ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు రాబట్టి తన విధ్వంసకర బ్యాటింగ్‌కు నాంది పలికాడు.
కేవలం 36 బంతుల్లో 222.22 స్ట్రైక్ రేట్‌తో 80 పరుగులు చేసిన రహేజా, జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. ఈ క్రమంలో టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. టీఎన్పీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా (ఎన్. జగదీశన్ తర్వాత) రికార్డు సృష్టించాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి
తిరుప్పూర్ ఘన విజయం..
రహేజా మెరుపు ఇన్నింగ్స్ కారణంగా తిరుప్పూర్ తమిళయన్స్ 18.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ప్రదోష్ రంజన్ పాల్ (42 నాటౌట్), ఎస్. మహమ్మద్ అలీ (25 నాటౌట్) చివర్లో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ట్రిచీ గ్రాండ్ చోళాస్, సంజయ్ యాదవ్ (32 బంతుల్లో 60 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అయితే, రహేజా తుఫాన్ ఇన్నింగ్స్ ముందు ఈ లక్ష్యం చిన్నబోయింది. ఈ సీజన్‌లో ట్రిచీకి ఇది మూడో ఓటమి కావడం గమనార్హం.
ఈ విజయంతో తిరుప్పూర్ తమిళయన్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. తుషార్ రహేజా ఫామ్ ఇలాగే కొనసాగితే, రాబోయే మ్యాచ్‌లలో కూడా తిరుప్పూర్‌కు తిరుగుండదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ వేలంలో నో ఛాన్స్..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న ఆటగాళ్లలో తుషార్ రహేజా కూడా ఉన్నాడు. అతని బేస్ ధర రూ. 30 లక్షలు. కానీ, ఏ జట్టు కూడా అతనిపై పందెం వేయలేదు. అయితే, రాబోయే దేశీయ సీజన్‌లో తుషార్ రహేజా తన ఫామ్‌ను కొనసాగిస్తే, తదుపరి వేలంలో అతని అదృష్టం ప్రకాశించవచ్చు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఈ సీజన్ ఇప్పటివరకు తుషార్ రహేజాకు చాలా బాగా జరిగింది. అతను 4 మ్యాచ్‌ల్లో 99.33 సగటుతో 298 పరుగులు చేశాడు. అతను 204.10 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. ప్రత్యేకత ఏమిటంటే అతను ఈ కాలంలో 4 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అంటే, అతను ప్రతి మ్యాచ్‌లో 50+ పరుగులు చేశాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఖ్య. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా అతన్ని ఆపలేకపోయాడు. అయితే, ఈ సీజన్ అతని జట్టుకు మిశ్రమంగా ఉంది. అతని జట్టు 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..