ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ టాక్ పీక్స్‌కి చేరింది..! అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ లబోదిబోమంటుంటే.. కేవలం అనర్హులను మాత్రమే ఏరిపారేస్తామని అధికార పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.
ఏపీలో పెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి..! దివ్యాంగుల పెన్షన్ పక్కదారి పడుతోందని లెక్కలతో సహా చెప్పుకొచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. గత ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు పెన్షన్లు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లకు లంచాలిచ్చి వికలాంగుల సర్టిఫికెట్‌తో పెన్షన్లు పొందుతున్నవాళ్ల సంఖ్య భారీగానే ఉందంటూ బాంబ్ పేల్చారు. ఇదే విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్న ఆయన.. అనర్హులను లిస్ట్ నుంచి తొలగించేవరకు తగ్గేదేలే అంటున్నారు. దివ్యాంగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు వైసీపీ నేతలు. ప్రతి నెలా పెన్షన్లను కట్ చేసుకుంటూ పోతూ అనర్హుల ముద్ర వేస్తున్నారని ఆగ్రహావేశాలు వెల్లగక్కారు. ఇప్పటివరకు నాలుగున్న లక్షల పెన్షన్లు తీసేశారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే దివ్యాంగుల పెన్షన్లపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. గతపాలనలో నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్లతో దందా చేశారని ఫైర్ అయ్యారు. దివ్యాంగులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్న ఆయన.. అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ రద్దు చేయమని హామీ ఇచ్చారు. వైసీపీ దుష్ప్రచారాలను ప్రజలెవరూ నమ్మెద్దన్నారు. అన్నివిధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి… ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది పెన్షన్ పొందుతున్నట్టు పరిశీలనలో తేలిందని తెలిపారు. అనర్హులైన పెన్లన్లు ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి నిర్ధారించినట్టు వెల్లడించారు. అయితే నకిలీ పెన్షన్లను మాత్రమే తొలిగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛనుదారుకు పెన్షన్ రద్దు కాకూడదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన పెన్షన్లు యధావిధిగా కొనసాగుతాయని, దివ్యాంగులు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని సీఎం సూచించారు.
ఇదిలావుంటే, దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు ఫిర్యాదులను మంత్రి నారాలోకేష్ దృష్టికి తీసుకెళ్లారు పలువురు మంత్రులు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అనర్హులు ప్రతినెల పెన్షన్ తీసుకుంటున్నారన్నారు. అయితే అర్హులు నష్టపోకుండా చూస్తామన్న నారాలోకేష్.. అనర్హులకు నయా పైసా వెళ్లొద్దన్నారు. మొత్తంగా.. పెన్షన్‌పై పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడుస్తోంది. మరీ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో..! అనర్హులను సహించేదేలేదన్న ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..