బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆసుపత్రి ఛైర్మెన్ నందమూరి బాలకృష్ణ, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, నారా బ్రాహ్మణి హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను సింహా.. పేరుతో చాలా సినిమాలు తీశాను అని.. కానీ ఇప్పుడు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేరుతో ఒక సినిమా తీయాలనుకుంటున్నానని బాలకృష్ణ అన్నారు.
ఎన్టీఆర్, బసవతారకం పుణ్యదంపతుల రూపమే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఆయన అన్నారు. 2000 జూన్ 22న అటల్ బిహారీ వాజపేయి ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారని.. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరి సహాయ సహకారాలతోనే ఈ హాస్పిటల్ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ వెయ్యి పడకలతో హాస్పిటల్ నిర్మించబోతున్నామని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఈ హాస్పిటల్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కల అని.. నందమూరి తారక రామారావు ప్రజల మనిషి అని చెప్పుకొచ్చారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
మరోవైపు నటుడు బాలకృష్ణతో తనకున్న అనుభందాన్ని మంత్రి పంచుకున్నారు. తాను ఇప్పటి వరకు చాలా మందిని కలిశాను.. కానీ బాలకృష్ణ మాత్రం చాలా డిఫరెంట్ మనిషి అని ఆయన అన్నారు. సొసైటీ పట్ల కమిట్మెంట్‌తో ఉన్న హీరో బాలకృష్ణ అని మంత్రి అన్నారు. పేద, ధనిక, కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి బసవతారకం హాస్పిటల్ సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..