ఓ మహిళ… ఆమె తన కుమార్తెకు ఈత నేర్పించే క్రమంలో ఆమె కూడా ఈతపై మక్కువ పెంచుకున్నారు. సాధన చేశారు.. అందరిలా ఈత నేర్చుకుని వదిలేస్తే ఏముంటుందిలే..! ఏదో ఒక ప్రత్యేకత సాధించాలనుకున్నారు. అందులోనే తన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవాలనుకున్నారు. ఇంతలో భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాను ప్రపంచ దేశాలకు మోడీ పరిచయం చేసిన విషయాన్ని గుర్తించారు. అప్పటినుంచి యోగా సాధన చేశారు. ఒకవైపు ఈత నేర్చుకోవడం.. మరోవైపు యోగా చేయడం..!
నేర్చుకున్న యోగా సైతం నీటిపై చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. సాధన చేశారు.. ఇంకేముంది.. నీటిపై తేలుతూ అలవోకగా ఆసనాలు వేసేస్తున్నారు. జల యోగాలో అద్భుతాలు చేస్తున్నారు. యోగాంద్ర వేడుకల్లో భాగంగా మరోసారి ఆసనాలు వేసి ఆ మహిళ అబ్బురపరిచారు. రెండు చేతుల్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాలు పట్టుకొని ఒక ఆసనం.. నుదుట, రెండు చేతులపై దీపాలు పెట్టుకొని మరోసారి చేసిన ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సంఘ సేవకురాలు, పారిశ్రామికవేత్త డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ నీటిపై తేలియాడుతూ యోగాసనాలు వేసి.. అబ్బురపరిచారు. యోగాంద్ర వేడుకల్లో భాగంగా ఎంవీపీకాలనీ ఎస్3 స్పోర్ట్స్ ఏరినాలో ఆమె జలయోగా ప్రదర్శించారు. గంటపాటు 30 రకాల ఆసనాలు వేసి ఔరా అనిపించారు.
ముప్పై ఏళ్ల వయసులో కుమార్తెకు ఈత నేర్పించే క్రమంలో తనకు కూడా స్విమ్మింగ్ లో ఆసక్తి పుట్టింది. ఇంతలో యోగాపై కూడా మక్కువ పెరిగింది. యోగ విశ్వవ్యాప్తం అవుతున్న తరుణంలో కాస్త ప్రత్యేకంగా తన వంతు సాధన చేయాలని అనుకున్నారు గీతా శ్రీకాంత్. భిన్నంగా ఉండేలా జలయోగా సాధన ప్రారంభించారు. పదేళ్లక్రితం వెన్నుముకకు శస్త్రచికిత్స జరిగిందని ఇక నడవలేనని వైద్యులు సూచించారన్నారట.
జల యోగ సాధనలో ఆమె ఆ సమస్య నుంచి బయటపడ్డాను అని చెబుతున్నారు. అంతేకాదు.. అధిక బరువుతో ఉన్న తాను కోవిడ్ బారినపడి శ్వాసనాలలో దాదాపుగా దెబ్బతిన్న తరుణంలో ఇక తాను బతకడం కష్టమని వైద్యులు కూడా చెప్పిన నేపథ్యంలో దృఢ సంకల్పంతో జలయోగ సాధన తో కోలుకున్నానని చెబుతున్నారు గీతా శ్రీకాంత్.
జల యోగ సాధనకు వయసు బరువుతో సంబంధం లేదని 90 కిలోలకు పైగా ఉన్న నీటిలో తెలియడంతో ఆసనాలు వేయడం వల్ల బరువు తెలియదని అన్నారు. 2019లో నాందేడ్ లో జరిగిన జాతీయ మాస్టర్స్ ఫెమింగ్ ఛాంపియన్షిప్లో ఈ జల యోగా ప్రదర్శనతో జాతీయ మాస్టర్ స్విమ్మింగ్ సంఘం నుంచి కూడా అవార్డు అందుకోవడం మరింత ఆత్మస్థైర్యాన్ని నింపిందని అంటున్నారు. నీటిపై ఆసనాలు వేసిన గీత శ్రీకాంత్ అభినందించారు కలెక్టర్.