మారుతున్న కాలంతో పాటు అత్తింటి వేధింపులు చాలావరకు తగ్గిపోయాయయనే మనం భావిస్తాం.. కానీ, ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇంకా జరుగుతున్నాయని ఒప్పుకోక తప్పదు..! ఆడపిల్లకు ముందు తరాలలాగా కాకుండా స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉన్నాయనే అనుకుంటాం. కానీ, ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే ఆ భావన తప్పు అని అనిపిస్తుంది. ఒక మహిళను అందులోనూ తనతో పాటు ఒక చిన్నపిల్ల ఉందని కూడా చూడకుండా రాళ్లతో దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో చూస్తే మనకు కూడా అయ్యో పాపం అనిపించక మానదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లా రోహట్ పట్టణంలో మానవత్వాన్ని కలచి వేసే ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను, ఆమె రెండేళ్ల కూతురిని అత్తింటివారు ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొట్టారు. అంతటితో ఊరుకోకుండా ఆ ఇద్దరిపై రాళ్లతో దాడి చేశారు. ఆ మహిళ సహాయం కోసం ఎంత అరుస్తున్నా చుట్టుపక్కల వారు ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఆ మహిళ, ఆ చిన్నారి ఇంటి గేటు బయటే దిక్కు లేనివాళ్ల లాగా నిలబడిపోయారు.
అలా నిలబడిన వాళ్ళ మీద పైనుండి ఒక పెద్ద వయసులో ఉన్న మహిళ రాళ్లు విసరడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులు ఈ విషయాన్ని గమనిస్తూ జాలి పడడం తప్ప, ముందుకు వచ్చి ఆ మహిళకు రక్షణగా నిలబడాలని అనుకోలేదు. రక్షించండి.. రక్షించండి అని మహిళ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. ఎలాంటి ఫలితం లేకపోయింది. పైగా పక్కనే ఆ చిన్నారి బిక్కుబిక్కుమంటూ చూస్తూ, అసలు అక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో నిలబడడం చూపరులను కంటతడి పెట్టించింది.
ఈ ఘటనపై ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ మహిళను ఆమె రెండేళ్ల కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. ఆ ఇంటి మెయిన్ గేటుకు తాళం వేసి, తల్లిని, బిడ్డను నిర్దాక్షిణ్యంగా బయటే ఉంచేశారు. దాంతో పాటు పై అంతస్తులో ఉన్న ఓ మహిళ రాళ్లు విసురుతూ దాడి చేసింది. చివరకు దెబ్బలు తాళలేక ఆ మహిళ, గేటు ముందే సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు అత్తింటివారితో ముందు నుంచి కుటుంబ వివాదాలు ఉన్నట్లు తెలిసింది. ఎంత గొడవలు ఉన్నప్పటికీ ఒక మహిళను అంత దారుణంగా అవమానించడం ఏంటని విమర్శిస్తున్నారు. పైగా పక్కనే ఆ చిన్నారిని చూసి అయినా వాళ్లకు జాలి కలగలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తల్లి తన బిడ్డను రక్షించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా, పై నుంచి రాళ్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ‘ఇంత మంది ఉన్న చోట, ఒక తల్లి మరియు బిడ్డపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారా?’ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్‌తో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..