బీట్ రూట్ జ్యూస్.. కేవలం రుచిగానే కాదు.. మీ రక్తపోటును తగ్గించడంలో కూడా అద్భుతంగా పని చేస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెద్ద వారికి ఇది చాలా ప్రయోజనకరమని నిపుణులు గుర్తించారు. ఇటీవల 30 ఏళ్ల లోపు యువతపై.. అలాగే 60 నుంచి 70 సంవత్సరాల వయసున్న వారిపై ఒక అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో బీట్ రూట్ జ్యూస్ లో ఉండే నైట్రేట్ అనే పదార్థాలు నోటిలోని చెడు బ్యాక్టీరియాను నియంత్రిస్తాయని తేలింది. దీని వల్ల వృద్ధులలో రక్తపోటు గణనీయంగా తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు.
అధిక బీపీ ఎందుకు ప్రమాదకరం..?
ఎక్కువ బీపీ ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇది రక్తనాళాలపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుంది. ఎక్కువ కాలం ఇలా ఉంటే.. రక్తనాళాలు బలహీనపడతాయి. ఇది హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు కారణం కావచ్చు. గతంలో చేసిన చాలా అధ్యయనాల్లో ఎక్కువ నైట్రేట్ ఉండే ఆహారం రక్తపోటును తగ్గిస్తుందని రుజువు అయింది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్.. ఎలా పని చేస్తాయి..?
పరీక్షలో పాల్గొన్న వారికి రోజుకు రెండుసార్లు, రెండు వారాల పాటు బీట్రూట్ రసాన్ని తాగించిన తర్వాత వారి రక్తపోటు తగ్గిందని గమనించారు. బీట్రూట్ రసంలో ఉన్న ఎక్కువ నైట్రేట్ పదార్థాలు నోటిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను అదుపు చేసి రక్తపోటును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించాయని అధ్యయనంలో తెలిసింది.
మీ నోటిలో మంచి, చెడు బ్యాక్టీరియా సరిగా లేకపోతే.. నైట్రేట్ అనే పదార్థం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారడంలో ఇబ్బందులు వస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలోని రక్తనాళాలను పెద్దవిగా చేస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు ఇది చాలా ముఖ్యం.
ఇంకా లాభాలు ఎన్నో..
నైట్రేట్ ఎక్కువ ఉండే ఆహారం శరీరానికి చాలా ఆరోగ్య లాభాలను ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ.. శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఎక్కువ రక్తపోటు సమస్యకు, గుండె జబ్బులు పెరగడానికి దారి తీస్తుంది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. బీట్రూట్ రసం సహజంగా బీపీని తగ్గించడంలో సహాయపడే అద్భుతమైన డ్రింక్ గా చూస్తారు.
ఇంకా బీట్రూట్లో బీటైన్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీని వల్ల కాలేయంలో కొవ్వు చేరడం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది తోడ్పడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)