భూమిపై రెండవ అతిపెద్ద మహాసముద్రం అయిన అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫాను సంభవించడం వాతావరణ శాఖను ఆశ్చర్యపరిచింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎరిన్ తుఫాను ఎంత వేగాన్ని అందుకుందంటే వాతావరణ శాస్త్రవేత్తలు కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే కేవలం 24 గంటల్లోనే ఈ తుఫాను కేటగిరీ-1 నుండి కేటగిరీ-5కి మారింది.
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, శుక్రవారం(ఆగస్టు 15) ఉదయం దాని వేగం 75 mph ఉండగా, శనివారం నాటికి అది 160 mph అంటే గంటకు సుమారు 260 కిలో మీటర్లు వేగాన్ని చేరుకుంది. అత్యంత వేగవంతమైన తుఫాన్‌గా రికార్డు పుస్తకాలలోకి ఎక్కింది. వాతావరణ మార్పు, సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా తుఫానులు ఇంత వేగంగా శక్తివంతంగా మారే సంఘటనలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
వాతావరణ శాస్త్రంలో దీనిని వేగవంతమైన తీవ్ర తుఫాన్‌గా భావిస్తున్నారు. అంటే తుఫాను 24 గంటల్లో కనీసం 35 mph వేగంతో వచ్చే తుఫాన్‌ను భారీ తుఫాన్‌గా భావిస్తారు. ఎరిన్ ఈ పరిమితిని చాలా వేగంగా మించిపోయింది. ఈ సంఘటన ఆగస్టు మధ్యలోనే జరిగింది. అయితే సాధారణంగా తుఫానులు అంత వేగంగా శక్తివంతంగా మారడం సెప్టెంబర్-అక్టోబర్ నెలలలో మాత్రమే కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
కాలానుగుణంగా వాతావరణ మార్పుల కారణంగా, వాతావరణ సంక్షోభంగా పరిగణించడం జరుగుతుందంటున్నారు నిపుణులు. అట్లాంటిక్‌లో నమోదైన 43 కేటగిరీ-5 తుఫానులలో ఎరిన్ ఒకటి. ప్రత్యేకత ఏమిటంటే, 2016 నుండి, 11 కేటగిరీ-5 తుఫానులు ఏర్పడ్డాయి. ఇది అసాధారణంగా ఎక్కువ. 2025 సీజన్ వరుసగా నాల్గవ కేటగిరీ-5 హరికేన్ కనిపించింది. 2024 ప్రారంభంలో, బెరిల్, మిల్టన్ అనే తుఫానులు ఇలాంటి బలాన్ని చూపించాయి. ఎరిన్ గమనం ప్యూర్టో రికో, కరేబియన్ దీవులకు నష్టం కలిగించకపోవచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఉత్తరం వైపు కదులుతుందని, అమెరికా తూర్పు తీరం బెర్ముడా మధ్య బహిరంగ అట్లాంటిక్‌లోకి వెళుతుందని చెబుతున్నారు. అయితే, దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇదిలావుంటే, పశ్చిమ మధ్య-పరిసర వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన వెల్ మార్క్డ్ లో ప్రెజర్ ఏరియా కొనసాగుతోంది. ఈ తక్కువ పీడన ప్రాంతం పశ్చిమ మధ్య – పరిసర వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై 18 ఆగస్టు 2025 ఉదయం 05:30 గంటలకు వెల్ మార్క్డ్ లో ప్రెజర్ ఏరియాగా ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో మరింత బలపడి డిప్రెషన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి మంగళవారం 19 ఆగస్టు 2025 ఉదయం దక్షిణఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని IMD చెబుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలకు మూడు రోజుల పాటు వాన ముప్పు ఉంటుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..