అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం చేసినా నిత్యం వృద్ధిచెందుతుందనీ, శాశ్వత ఫలితాలిస్తుందనీ నమ్మకం. ఈ పర్వదినం లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది. బంగారం ఆమెకు ప్రియమైనది. అందుకే ఈ రోజున బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆస్తి, ఐశ్వర్యం పొందుతారని విశ్వసిస్తారు. ఈసారి మీ రాశిచక్రానికి తగినట్టుగా బంగారం లేదా వెండిని కొనుగోలు చేయండి. అలా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మేష రాశి
ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున బంగారు ఉంగరం కొనాలి. ఇది రవిగ్రహ ప్రభావాన్ని పెంచి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విజయాన్ని అందిస్తుంది. మేషరాశి అధిపతి కూడా రవిగ్రహమే.
వృషభ రాశి
ఈ రాశికి శుక్రగ్రహం అధిపతి ఇది వెండిని సూచిస్తుంది. కాబట్టి మీరు వెండి నాణేలు, పాయల్స్ కొనొచ్చు. వెండి నాణెం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది.
మిథున రాశి
ఈ రాశివారు బంగారు గొలుసు కొనడం మంచిది. మీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే బంగారు చెవి పోగులు కూడా కొనడం మంచిదే. బంగారం మీ మాటతీరును, ఆలోచించే శక్తిని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
కర్కాటక రాశి
ఈ రాశికి చంద్రుడు అధిపతి కావడంతో బంగారం కన్నా వెండి మేలుగా ఉంటుంది. వెండి గొలుసు లేదా బ్రాస్లెట్ కొనడం ద్వారా మానసిక స్థిరత పెరుగుతుంది.
సింహ రాశి
ఈ రాశివారు బంగారు గొలుసు లేదా హారం కొనడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు. సూర్యుడే అధిపతి కావడంతో బంగారం శుభం.
కన్యా రాశి
బంగారు గాజులు, ముక్కుపుడక లేదా ఉంగరం కొనడం వల్ల వృత్తిలో అభివృద్ధి పొందవచ్చు. అదృష్టం పెరగడంతో పాటు గ్రహదోషాలు తొలగుతాయి.
తుల రాశి
వెండి పాయల్స్ కొనడమూ.. వాటిని లక్ష్మీదేవికి అర్పించి తరువాత ధరించడం శుభప్రదం. ఇది దంపతుల మధ్య సంబంధాన్ని బలపరిచి మానసిక ప్రశాంతతనిస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు బంగారు ముక్కుపుడక లేదా ఉంగరం కొనవచ్చు. అయితే మంగళగ్రహ ప్రభావం వల్ల బంగారాన్ని పరిమితంగా మాత్రమే ధరించాలి.
ధనుస్సు రాశి
బృహస్పతిగ్రహం అధిపతి అయిన ఈ రాశి వారికి బంగారం ఎంతో శుభప్రదం. బంగారు గొలుసు, మాంగ్ టిక్కా, గాజులు లేదా హారం కొనడం మంచిదే.
మకర, కుంభ రాశులు
ఈ రాశులకు శనిగ్రహం అధిపతి. కాబట్టి బంగారంకన్నా వెండి ఉత్తమం. వెండి బ్రాస్లెట్ లేదా ఆభరణాలు కొనడం శుభదాయకం.
మీనా రాశి
ఈ రాశికి బృహస్పతి అధిపతి. కాబట్టి బంగారు గాజులు, హారాలు, గొలుసులు, చెవి పోగులు కొనడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
ఇలా ఈ విధంగా మీ రాశికి తగినట్టుగా బంగారం లేదా వెండి కొనడం ద్వారా ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సిరిసంపదలను నింపుతుంది.